IPL-2018: చివరి పది నిమిషాల్లో మారిన ఫలితం... ముంబైపై చెన్నై విజయం!
- అసలైన టీ-20 మజాను చూపిన తొలి మ్యాచ్
- తొలుత బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్
- 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిన చెన్నై సూపర్ కింగ్స్
- 68 పరుగులతో రాణించిన బ్రావో
టీ-20లో ఉన్న అసలైన మజా ఐపీఎల్-2018 తొలి మ్యాచ్ లోనే తెలిసొచ్చింది. రెండు సంవత్సరాల పాటు నిషేధాన్ని ఎదుర్కొని, తిరిగొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఓపెనర్ల నుంచి ధోనీ సహా మిడిలార్డర్ వరకూ అంతా విఫలంకాగా, డ్వేన్ బ్రావో నమ్మశక్యం కాని రీతిలో మెరుపు ఇన్నింగ్స్ ఆడి చెన్నైని విజయతీరాలకు చేర్చాడు. వాంఖడే స్టేడియంలో అసంఖ్యాకమైన ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ గొంతులు మూగబోయిన వేళ, చెన్నై విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 15, లూయిస్ 0, ఇషాన్ కిషన్ 40, సూర్యకుమార్ 43, హార్దిక్ పాండ్యా 22, కృనాల్ పాండ్య 41 పరుగులు చేశారు. ఆపై బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టులో వాట్సన్ 16, అంబటి రాయుడు 22, రైనా 4, కేదార్ జాదవ్ 24, ధోనీ 5, జడేజా 12, చాహర్ 0, హర్భజన్ 8, వుడ్ 1 పరుగులు చేయగా, బ్రావో 68 పరుగులు చేశాడు. ముంబై జట్టులోని మయాంక్ మార్కండే అద్భుత రీతిలో బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. కాగా, నేడు మొహాలీ వేదికగా, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య సాయంత్రం 4 గంటల నుంచి, కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 8 గంటల నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి.