Rape: అత్యాచార విషయంలో భారత మహిళ అబద్ధం చెప్పదు: బాంబే హైకోర్టు
- 2012లో సామూహిక అత్యాచారానికి గురైన మహిళ
- నిందితులపై పదేళ్ల శిక్ష విధించిన సెషన్స్ కోర్టు
- అపీలు చేసినా అదే శిక్ష ఖరారు చేసిన హైకోర్టు
ఓ పరువుగల కుటుంబం నుంచి వచ్చిన యువతి తనపై అత్యాచారం జరిగిందని చెప్పదని, రేప్ విషయంలో ఫిర్యాదు చేయడం ఆలస్యమైనంత మాత్రాన నిందితులు తప్పించుకోలేరని చెబుతూ నలుగురు వ్యక్తులకు సెషన్స్ కోర్టు విధించిన 10 సంవత్సరాల శిక్షను బాంబే హైకోర్టు ఖరారు చేసింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, 2012 మార్చి 15న తన స్నేహితుడితో కలసి నాసిక్ వెళుతున్న మహిళపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై రెండు రోజుల తరువాత ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయగా విచారణ జరిపిన సెషన్స్ కోర్టు 2013 ఏప్రిల్ లో పదేళ్ల శిక్ష విధించింది. ఆమె శరీరంపై ఎటువంటి గాయాలు లేవని, ఆమె, ఆమె స్నేహితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి తాము నిలదీయగా, పోలీసులకు తనపై అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ, హైకోర్టుకు అపీలు చేశారు. కేసును విచారించిన హైకోర్టు, తల్లిదండ్రుల పరువు పోతుందన్న భయంతో సదరు మహిళ రెండు రోజులు ఫిర్యాదు చేసేందుకు రాకపోయి ఉండవచ్చని, శరీరంపై గాయాలు లేకుంటే లైంగిక వేధింపులు జరగనే లేదని భావించలేమని పేర్కొంది. ఆలస్యంగా ఫిర్యాదు చేసినంత మాత్రాన అబద్ధం చెప్పినట్టు భావించలేమని పేర్కొంది.