Rahul Gandhi: ఈ దేశంలో ఉన్నవారంతే జంతువులే... కేవలం ఇద్దరు మాత్రమే జంతువేతరులు: రాహుల్ గాంధీ దెప్పిపొడుపు
- కర్ణాటకలో రాహుల్ ఎన్నికల ప్రచారం
- అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టిన రాహుల్
- ప్రజలంటే ఇసుమంతైనా గౌరవం లేని మోదీ, అమిత్
- బుద్ధి చెప్పే సమయం రానుందని వ్యాఖ్య
భారత దేశంలో ఉన్న ప్రజలంతా జంతువులేనని, కేవలం రెండే రెండు జంతువేతరులు ఉన్నారని, వారు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలేనని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్ బంగారం గునుల పరిసరాల్లో ప్రచారం చేస్తున్న ఆయన, ఓ సభలో మాట్లాడారు. రెండు రోజుల క్రితం విపక్షాలను పిల్లులు, పాములు, కుక్కలతో అమిత్ షా పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ స్పందిస్తూ, బీజేపీ నేతలను దెప్పిపొడిచారు. తదుపరి ఎన్నికల్లో తమ ప్రభుత్వం ఉండదని అర్థం చేసుకున్న మోదీ, మానసికంగా కుంగిపోయారని, దాని ఫలితమే ఇటువంటి అగౌరవ మాటలని అన్నారు. దేశంలోని దళితులు, మైనారిటీలు సహా తమ పార్టీ నేతలను కూడా వారు పనికిరాని వారుగా చూస్తున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు. మోదీ, అమిత్ షాల ప్రసంగాల్లో ఇసుమంతైనా గౌరవంగా విమర్శలు దొర్లడం లేదని ఆరోపించారు. వారి వైఖరిని ప్రతి ఒక్కరూ పరిశీలిస్తున్నారని, బుద్ధి చెప్పేందుకు తగిన సమయం కోసం వేచి చూస్తున్నారని చెప్పారు. ఆర్థికంగా దేశాన్ని సర్వనాశనం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని, బ్యాంకుల కుంభకోణాలు పెరిగిపోయానని, నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. నిరావ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా, పీయుష్ గోయల్ వంటి వారెందరో దేశాన్ని నాశనం చేశారని చెప్పారు.