Pnb: ఏడాదికి ముందే సీవీసీ హెచ్చరించినా పట్టించుకోని పీఎన్ బీ... తర్వాతే భారీ కుంభకోణం
- 2017 జవనరిలో సీవీసీ సమావేశం
- జ్యుయలరీ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అవకతవకలపై అప్రమత్తత
- అప్పుడే సమీక్ష చేపట్టి ఉంటే నీరవ్ మోదీ స్కామ్ ముందే వెలుగులోకి
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ 13,000 కోట్ల భారీ కుంభకోణం బయటపడడానికి సరిగ్గా ఏడాది ముందే కేంద్ర నిఘా సంస్థ (సీవీసీ) జ్యుయలరీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై బ్యాంకులను అప్రమత్తం చేసింది. అయినా పీఎన్ బీ వజ్రాల కంపెనీలకు ఇచ్చిన రుణాలపై పెద్దగా దృష్టి సారించినట్టు లేదు. దీంతో మోదీ స్కామ్ ఆలస్యంగా బయటపడింది. లేకుంటే గతేడాదే ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చి ఉండేది.
సీవీసీ వార్షిక నివేదిక 2017 ప్రకారం... సీవీసీ 2017 జనవరి 5న ఓ సమావేశం నిర్వహించింది. సీబీఐ సీనియర్ అధికారులు, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్, 10 బ్యాంకులకు చెందిన చీఫ్ విజిలెన్స్ అధికారులు (ఇందులో పీఎన్ బీ అధికారి కూడా ఉన్నారు) పాల్గొన్నారు. జెమ్స్, జ్యుయలరీ రంగానికి ఇచ్చిన రుణాల్లో తీవ్ర అవకతవకలపై చర్చించేందుకే సీవీసీ నాడు సమావేశం నిర్వహించింది.
దీనిపై చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి మాట్లాడుతూ... విన్సమ్ గ్రూపునకు చెందిన జతిన్ మెహతా బ్యాంకులకు చేసిన మోసాలపై చర్చించేందుకు సమావేశం నిర్వహించినట్టు చెప్పారు. ఆ సందర్భంగా ఇతర జ్యుయలరీ సంస్థలకు ఇచ్చిన రుణాల్లో అవకతవకలపైనా చర్చించినట్టు చౌదరి చెప్పారు.