ipl: ఐపీఎల్ ను తాకిన ‘కావేరి’ సెగలు .. చెన్నైలో భద్రత కట్టుదిట్టం?
- రేపు చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్
- ఈ మ్యాచ్ ను ‘కావేరి’ నిరసనకారులు అడ్డుకునే అవకాశం?
- నిఘా వర్గాల హెచ్చరిక
- ఐపీఎల్ నిర్వాహకులు, చెన్నై పోలీసులు అప్రమత్తం
కావేరీ నదీ జలాలకు సంబంధించి కర్ణాటక, తమిళ రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయం తెలిసిందే. కావేరీ నదీ జలాల వివాదం విషయమై అల్లర్లు చెలరేగే అవకాశముందని, నిఘా వర్గాలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. రేపు చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ను ‘కావేరీ’ నిరసనకారులు అడ్డుకునే అవకాశం ఉందని, స్టేడియంలో గందరగోళం సృష్టించేందుకు ఆస్కారం ఉందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే, కొన్ని పార్టీలు అధిక సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేసినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో, భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐపీఎల్ నిర్వాహకులు, చెన్నై పోలీసులు అప్రమత్తమయ్యారు. కాగా, కావేరీ బోర్డుకు నిరసనగా నల్లదుస్తులు, బ్యాడ్జిలు ధరించాలని సూపర్ స్టార్ రజనీకాంత్ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ ను తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు ఐపీఎల్ నిర్వాహకులు కొన్ని నిబంధనలు విధించారు. ప్రేక్షకులు నల్లదుస్తులతో రాకూడదని ఆంక్షలు విధించింది.