priya prakash: ప్రియా ప్రకాశ్ వారియర్ పై ‘సుప్రీం’లో మరో కేసు!
- ‘మాణిక్య మలరయ’ పాటలో ప్రియా కన్నుకొట్టడంపై అభ్యంతరం
- కన్ను కొట్టడం ఇస్లాం మత సంప్రదాయానికి వ్యతిరేకం
- ‘సుప్రీం’ ను ఆశ్రయించిన హైదరాబాద్ ముస్లింలు
‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ‘మాణిక్య మలరయ’ అనే పాటతో మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ ఎంత పాప్యులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ పాట ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ హైదరాబాద్ కు చెందిన ముస్లింలు గతంలో సుప్రీం కోర్టును ఆశ్రయించడం, ఈ సినిమా దర్శకుడు ఒమర్ లులుపై, ప్రియపై కేసు పెట్టడం విదితమే.
తాజాగా, హైదరాబాద్ కే చెందిన కొందరు ముస్లింలు మళ్లీ సుప్రీంకోర్టులో మరో కేసు వేశారు. ‘కన్ను కొట్టడం ఇస్లాం మత సాంప్రదాయానికి వ్యతిరేకమని, ఈ సినిమా విడుదలకు అనుమతిచ్చే ముందు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని’ తమ పిటిషన్ లో వారు కోరారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి వేసిన తొలి కేసు విషయమై ప్రియా ప్రకాశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తనపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని కోరిన ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. గత మార్చి 1న విడుదల కావాల్సిన ఈ సినిమా జూన్ కు వాయిదా పడటం తెలిసిందే.