Uttar Pradesh: బీజేపీ ఎమ్మెల్యేపై రేప్ కేసు పెట్టిన యువతి.. పోలీసుల కస్టడీలో ఆమె తండ్రి మృతి!
- బాధిత యువతి ఫిర్యాదు చేసినా కేసు పెట్టని పోలీసులు
- యువతి తండ్రిపై మాత్రం కుట్ర అభియోగాలు మోపి అదుపులోకి
- కస్టడీలోనే మృతి.. పోలీసులే చంపేశారంటున్న యువతి కుటుంబం
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్, ఆయన సోదరులు ఏడాది క్రితం తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన 18 ఏళ్ల యువతి తండ్రి పోలీసుల కస్టడీలో మృతి చెందారు. ఎమ్మెల్యేపై కుట్ర అభియోగాలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతి ఫిర్యాదు చేసినా కేసు పెట్టని పోలీసులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె తండ్రిని మాత్రం ఈనెల 5న అరెస్ట్ చేశారు. దీంతో యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ఎదుట ఆదివారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న బాధిత యువతి తండ్రి అదే రోజు రాత్రి స్థానిక ఆసుపత్రిలో మృతి చెందారు. పోలీసులే తన తండ్రిని చంపేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. లాఠీలతో చావబాదడం వల్లే తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయాడని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం స్పందించారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు ఆరుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.