iphone: ఐఫోన్ 8లో స్పెషల్ ఎడిషన్ విడుదల... అమ్మకాల్లో కొంత భాగం సమాజ సేవ కోసం వినియోగం!
- బ్లాక్, రెడ్ రంగుల్లో లభ్యం
- వీటి అమ్మకాల ఆదాయంలో కొంత భాగం గ్లోబల్ ఫండ్ కు
- ఎయిడ్స్ నివారణ కార్యక్రమాలకు వినియోగం
స్మార్ట్ ఫోన్లలో మేటి సంస్థ యాపిల్ ఐఫోన్ 8లో ప్రత్యేకంగా ఆర్ఈడీ ఎడిషన్ ను విడుదల చేసింది. వీటి అమ్మకాల్లో కొంత భాగాన్ని ఆర్ఈడీ ద్వారా గ్లోబల్ ఫండ్ కు అందిస్తుంది. 2006 నుంచి యాపిల్ కు ఆర్ఈడీతో భాగస్వామ్యం ఉంది. ఆర్ఈడీ వివిధ కంపెనీల నుంచి నిధులు సమీకరించి ఎయిడ్స్ తదితర వ్యాధుల నివారణకు, కౌన్సెలింగ్, చికిత్స తదితర అవసరాల కోసం వినియోగిస్తుంటుంది.
సామాజిక సేవా కోణంలో యాపిల్ ఆర్ఈడీ ఎడిషన్ పేరుతో ఐఫోన్ 8ను విడుదల చేయడం విశేషం. నిజానికి యాపిల్ ఇప్పటికే 16 కోట్ల డాలర్లను గ్లోబల్ ఫండ్ కు అందించింది. ఆర్ఈడీ ఎడిషన్ ఐఫోన్లు రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి. వీటిని కొనుగోలు చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిపై పోరులో పాలు పంచుకున్నట్టు అవుతుందని యాపిల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్విక్ సూచించారు.