Chandrababu: అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు
- మంగళగిరిలో ఆనంద నగరాల సదస్సు ప్రారంభం
- ఇలాంటి సదస్సుకు ఆతిథ్యమివ్వడం సంతోషంగా ఉంది
- అమరావతి నిర్మాణానికి అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించామన్న చంద్రబాబు
అత్యున్నత ప్రమాణాలతో అమరావతిని ఆనంద నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఆనంద నగరాల సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సును ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ తో కలిసి చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ రాజధానిలో ఇలాంటి సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, అమరావతిని అత్యంత ఆనంద నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
అమరావతి నిర్మాణం నిమిత్తం అత్యుత్తమ కన్సల్టెంట్లను నియమించామని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధానాల కోసం అన్వేషిస్తున్నామని, అందుకోసం అందరి సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ఏపీలోని ముఖ్యనగరాలు, పట్టణాల్లో హ్యాపీ సండేలు నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కాగా, మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకి 27 దేశాల ప్రతినిధులు, వివిధ నగరాల మేయర్లు హాజరయ్యారు.