Hyderabad: ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని దోపిడీ!
- దిల్ షుక్ నగర్ లోని ఒక ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామన్న ఆగంతుకులు
- కనెక్షన్ వద్దనడంతో బలవంతంగా ఇంట్లో దూరి దంపతులను బంధించిన దొంగలు
- దొంగలు నగలు, నగదు తీసుకుని పారిపోతుండగా వచ్చిన దంపతుల కుమారుడు
ఇంట్లో దూరి తల్లిదండ్రులను బంధించి నగలు దోచుకుపోతున్న దొంగలను బాలుడు వెంటాడి పోలీసులకు పట్టించిన ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది. ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే... దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ బస్ డిపోలో పని చేసే ప్రభాకర్ రెడ్డి, అక్కడికి దగ్గర్లో భార్య సునీత, కుమారుడు సాత్విక్ రెడ్డితో కలిసి నివాసం ఉంటున్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఉన్న సమయంలో నలుగురు ఆగంతుకులు వచ్చి, ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు వచ్చామని చెప్పారు. తమకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదని ప్రభాకర్ రెడ్డి వారికి సమాధానమివ్వగా, ఆయనను తోసుకుని బలవంతంగా వారింట్లోకి చొరబడ్డారు. ప్రభాకర్ రెడ్డి దంపతులను బెదిరించి వారిని తాళ్లతో బంధించారు.
అనంతరం నగలు, నగదు తీసుకున్నారు. ఇంతలో బయటి నుంచి ఇంటికి వచ్చిన సాత్విక్ రెడ్డి కాలింగ్ బెల్ మోగించాడు. దీంతో ఉలిక్కిపడిన దొంగలు డోర్ తెరిచి పరుగందుకున్నారు. వేగంగా కదిలిన సాత్విక్ రెడ్డి 'దొంగ దొంగ' అని అరుస్తూ వారి వెంటబడ్డాడు. దీంతో అప్రమత్తమైన సాత్విక్ రెడ్డి స్నేహితుడు కూడా వారిని వెంబడించాడు. వారిద్దరూ కలిసి ఒక దొంగను పట్టుకున్నారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. సాత్విక్ రెడ్డి ధైర్యానికి మెచ్చిన పోలీస్ కమిషనర్, అతనిని అభినందించి, 5000 రూపాయల నజరానా అందజేశారు.