Commonwealth Games: బాక్సింగ్ రింగ్ లో అదరగొడుతూ ఫైనల్ కు చేరిన మన మహిళా ఎంపీ... స్వర్ణమా? రజతమా?
- కామన్ వెల్త్ పోటీల్లో తొలిసారిగా పాల్గొంటున్న మేరీ కోమ్
- సెమీస్ లో లంక క్రీడాకారిణిని మట్టికరిపించిన రాజ్యసభ సభ్యురాలు
- భారత ఖాతాలోకి మరో పతకం జమ అయినట్టే
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్ వెల్త్ పోటీల్లో ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి, రాజ్యసభ సభ్యురాలు మేరీకోమ్ ఫైనల్ కు చేరుకోవడంతో మరో పతకం ఖరారైంది. మహిళల 48 కిలోల విభాగంలో పోటీ పడుతున్న ఆమె సెమీస్ లో శ్రీలంకకు చెందిన అనూషను 5-0 తేడాతో ఓడించి ఫైనల్లోకి వెళ్లింది. గతంలో ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన మేరీ కోమ్, ఒలింపిక్ పతకాన్ని సైతం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే మేరీ కోమ్ కామన్ వెల్త్ పోటీల్లో పాల్గొనడం మాత్రం ఇదే మొదటి సారి. ఇదిలావుండగా, నేడు జరిగిన 50 మీటర్ల పిస్టల్ షూటింగ్ లో ఇండియాకు చెందిన ఓం ప్రకాష్ మితర్వాల్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ పోటీల్లో మితర్వాల్ కు ఇది రెండో పతకం కావడం గమనార్హం. ఇదే పోటీలో జీతూ రాయ్ నిరాశ పరిచాడు. అతను కేవలం 8వ స్థానానికి మాత్రమే పరిమితం అయ్యాడు. 60 కేజీల బాక్సింగ్ విభాగంలో సరితాదేవి ఆస్ట్రేలియాకు చెందిన అంజా చేతిలో ఓటమి పాలైంది.