kumar vishwas: కుమార్ విశ్వాస్ ను కీలక పదవి నుంచి తొలగించిన ఆప్
- రాజస్థాన్ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తొలగింపు
- విశ్వాస్ స్థానంలో దీపక్ బాజ్ పాయి నియామకం
- ఏడాది క్రితం కేజ్రీపై తిరుగుబాటు చేసిన విశ్వాస్
కీలక నేత కుమార్ విశ్వాస్ ను రాజస్థాన్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయన రాజస్థాన్ ఇన్ ఛార్జిగా వ్యవహరించబోరని ప్రకటించింది. కుమార్ విశ్వాస్ స్థానంలో దీపక్ బాజ్ పాయి బాధ్యతలను నిర్వహిస్తారని ఆప్ జాతీయ ప్రతినిధి అశుతోష్ తెలిపారు.
ఇక నుంచి రాజస్థాన్ వ్యవహారాలను దీపక్ చూస్తారని... రాజస్థాన్ లో పార్టీని బలోపేతం చేయడమే కాక, అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేస్తారని చెప్పారు. కుమార్ విశ్వాస్ కొన్ని పనుల్లో తలమునకలై ఉన్నారని... ఈ నేపథ్యంలో, రాజస్థాన్ కేడర్ ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సమయాన్ని కేటాయించలేకపోతున్నారని... అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపారు.
ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించిన నలుగురు వ్యక్తుల్లో కేజ్రీవాల్ తో పాటు కుమార్ విశ్వాస్ కూడా ఉన్నారు. ఏడాది క్రితం కేజ్రీవాల్ పై ఆయన తిరుగుబాబు జెండా ఎగురవేశారు. అయితే, పార్టీ నుంచి మాత్రం వైదొలగలేదు. ఆప్ కూడా అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే కుమార్ విశ్వాస్ తో జరిగిన చర్చల్లో భాగంగా... అతనికి రాజస్థాన్ బాధ్యతలను అప్పగించారు. ఇప్పడు ఆ పదవి నుంచి తొలగించారు.