chennai: వైజాగ్ ను వదిలేసి పూణెను ఎంచుకున్న ధోనీ... మారిన చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్!
- పూణెకు మారిన చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి మ్యాచ్ లు
- గత రెండేళ్లుగా ధోనీ ఆడిన గ్రౌండ్ కావడమే కారణం
- చెన్నైలో భద్రత కష్టమని పోలీసులు చెప్పడంతోనే నిర్ణయం
ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ మారిపోయింది. చెన్నైలోని చేపాక్ స్టేడియంలో తదుపరి ఐపీఎల్ మ్యాచ్ లకు తాము భద్రత కల్పించలేమంటూ పోలీసులు చేతులెత్తేయడంతో, ఆ జట్టు పూణెను తమ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకుంది. పూణెతో పాటు విశాఖపట్నం పేరు కూడా చెన్నై ఫ్రాంచైజీ పరిశీలనలో ఉన్నప్పటికీ, ధోనీ పూణెవైపే మొగ్గు చూపినట్టు సమాచారం.
తమిళనాడులో జరుగుతున్న కావేరీ జలాల వివాదం మరింత పెరుగగా, ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని బెదరింపులు రావడం, తొలి మ్యాచ్ లో క్రికెటర్లపై బూట్లు విసరడం వంటి ఘటనలతో ఆందోళన చెందిన బీసీసీఐ పెద్దలు, హోమ్ గ్రౌండ్ తరలింపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఆపై నిన్న సమావేశమైన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం, స్టేడియం మార్పును ఖరారు చేసింది. అయితే, సూపర్ కింగ్స్ లో అత్యధికులు చెన్నై వాతావరణానికి దగ్గరగా ఉండే విశాఖను ఎంచుకోవాలని భావించినప్పటికీ, గత రెండేళ్లుగా తనకు బాగా తెలిసిన గ్రౌండ్ కావడం ధోనీ మనసును పూణెవైపు మళ్లించింది.
ఇక పూణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా, ఆటగాడిగా గత రెండు సంవత్సరాలూ ధోనీ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడిన సంగతి తెలిసిందే. అందువల్ల పూణెలో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఈ కారణంతోనే ధోనీ ఆ నగరాన్ని ఎంచుకున్నట్టు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక చెన్నై తదుపరి హోమ్ గ్రౌండ్ మ్యాచ్ లను పూణెలో ఆడనుంది.