csk: చెన్నై ఫ్యాన్స్ తరపున క్రికెటర్లకు క్షమాపణలు చెప్పిన సినీ నటి కస్తూరి
- స్టేడియంలోకి చెప్పులు విసిరిన నిరసనకారులు
- ఆ చెప్పులను బయటకు విసిరేసిన డుప్లెసిస్, జడేజా
- క్షమాపణలు చెప్పిన చెన్నై ఫ్యాన్స్
ఐపీఎల్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) - కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై తమిళనాడు క్రికెట్ అభిమానుల తరపున రచయిత, విశ్లేషకురాలు, ప్రముఖ సినీ నటి కస్తూరి శంకర్ క్షమాపణలు చెప్పారు. కావేరీ జల వివాదం నేపథ్యంలో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణను తమిళులు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ ను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో సుమారు 4000 మంది పోలీసులతో చేపాక్ స్టేడియంకు భద్రత కల్పించారు.
అయినప్పటికీ పలువురు అభిమానులు స్టేడియంలోకి చెప్పులు విసరగా, బౌండరీలైన్ బయట ఉన్న డుప్లెసిస్, బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా వాటిని బయటకు విసిరేశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన కస్తూరి.. డుప్లెసిస్, జడేజాలను ట్యాగ్ చేస్తూ, క్షమాపణలు చెప్పారు. ఆ తరువాత పలువురు అభిమానులు వారిని ట్యాగ్ చేస్తూ, ‘మేం మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. స్టేడియంలో జరిగిన ఘటనకు చింతిస్తున్నాం. ఇందుకు క్షమాపణలు చెబుతున్నాం. మా గురించి తప్పుగా భావించొద్దు. మీరంటే మాకు అమితమైన గౌరవం ఉంది.’ అంటూ ట్వీట్లు చేశారు.