sukumar: మహేశ్ మూవీ ప్లాప్ అయినప్పుడు చాలా బాధపడ్డాను: సుకుమార్
- షూటింగ్ సమయంలో ఎంజాయ్ చేయలేను
- సినిమా పూర్తయ్యేవరకూ నిద్రపట్టదు
- హిట్ అయిన రోజునే కష్టమంతా మరిచిపోతాను
సుకుమార్ తెరకెక్కించిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అందించిన సక్సెస్ ను ఆయన ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ఆయన ప్రస్తావించారు. "మహేశ్ తో చేసిన '1 నేనొక్కడినే' ప్లాప్ అయినప్పుడు మీరెలా ఫీలయ్యారు?" అనే ప్రశ్న సుకుమార్ కి ఎదురైంది.
అందుకాయన స్పందిస్తూ " 1 నేనొక్కడినే' సినిమా సూపర్ హిట్ అవుతుందని నేను అనుకున్నాను. అలా జరగకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా. మొదటి నుంచి కూడా నేను సినిమా తీసే విధానం చాలా కష్టతరంగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేయలేను. ఒక సినిమా చేస్తున్నంత సేపు మనసంతా దానిపైనే ఉంటుంది .. నిద్రకూడా సరిగ్గా పట్టదు. ఒక సినిమా కోసం పడిన కష్టమంతా మరిచిపోయి సంతోషంగా ఉండేది అది హిట్ అయిన రోజునే. అది హిట్ కాకపోతే మనసుకి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. '1 నేనొక్కడినే' సినిమా అలాంటి బాధకి నన్ను గురిచేసింది" అని చెప్పుకొచ్చారు.