sri reddy: శ్రీరెడ్డితో కలిసి పనిచేయొద్దనే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ ఉండదు!: తమ్మారెడ్డి భరద్వాజ
- ఒక అమ్మాయి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే మనందరమూ సిగ్గుపడాలి
- మాట్లాడుకోవాల్సింది ఆ అమ్మాయి గురించి కాదు
- లేవనెత్తిన సమస్య గురించి
నటి శ్రీరెడ్డితో కలిసి పని చేయొద్దని చెప్పే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదని ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ‘నా ఆలోచన’లో ఆయన మాట్లాడుతూ, ‘శ్రీరెడ్డి అన్నంత పనీ చేసింది. ఆ అమ్మాయి గొడవ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నాను .. ఎవరో ఒకళ్లు పిలిచి మాట్లాడాలని! నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేశాను! ఆ అమ్మాయి ఏంటీ? అనే దాని గురించి ఎక్కువగా చర్చించుకోవడం కంటే, ఆమె లేవనెత్తిన సమస్య గురించి మాట్లాడుకోవడం అ వసరం.
ఆ అమ్మాయి లేవనెత్తిన సమస్య ఉందా? లేదా? ఒకవేళ ఉంటే ఎలా అరికట్టాలి? దానికి కొన్ని పరిష్కారాలు నేను చెప్పాను. ఇప్పుడు మళ్లీ మాట్లాడుకోవచ్చు. అసలు, ఈ పరిస్థితి రానివ్వచ్చా? ఆలోచించడానికి సంఘాలున్నాయి కదా అని మనం ఆలోచించడం మానేశాం. వాళ్లు ఉన్నారులే, మనం ఆలోచించేదేమిటంటూ సంఘాలు, సంఘాల్లో నాయకులు ఆలోచించడం మానేశారు. దీంతో, ఈ సమస్య జటిలమైపోతోంది. ఒక అమ్మాయి ఛాంబర్ ముందుకొచ్చి అర్ధనగ్న ప్రదర్శన చేసిందంటే..మనందరమూ సిగ్గుపడాల్సిన విషయం. ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడటం కంటే కూడా ఆ పరిస్థితి వచ్చినందుకు మనందరమూ సిగ్గుతో తలొంచుకోవాలి’ అని చెప్పుకొచ్చారు.