Andhra Pradesh: 16న ఏపీ బంద్‌కు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది!: రఘువీరారెడ్డి
- 'హోదా' కోసం పోరాటాలు ఉద్ధృతం
- కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు
- పార్టీలన్నీ పాల్గొంటున్నాయి
- మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన కోసం హోదా సాధన సమితి ఈ నెల16న ఏపీ బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ బంద్‌కు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు.
"ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటాలు ఉద్ధృతమవుతున్నాయి. హోదా సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలన్నీ దీక్షలు, నిరసనలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే హోదా సాధన సమితి బంద్‌కు పిలుపు నిచ్చింది. పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా బంద్ కు దిగుతున్నామని సాధన సమితి నాయకులు తెలిపారు. ప్రధానమంత్రి దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది" అని రఘువీరారెడ్డి పేర్కొన్నారు.