bjp: ఏపీ నుంచే బీజేపీ పతనం ప్రారంభమవుతుంది : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ప్రధాని మోదీ విధానాలు దేశానికి నష్టం కలిగించేలా ఉన్నాయి
  • దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితులను తీసుకువస్తున్నారు
  • గవర్నర్ నరసింహన్ కు ఏపీ సమస్యలు పట్టడం లేదు

రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ పతనం ఏపీ నుంచే ప్రారంభమవుతుందని రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ విధానాలు దేశానికి నష్టం కలిగించేలా ఉన్నాయని, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి దేశాన్ని ముక్కలు చేసే పరిస్థితులను తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదా, ప్యాకేజీలను ఇవ్వని కేంద్ర ప్రభుత్వం, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కూడా నిధులు సక్రమంగా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాల ఆదాయంపై కేంద్రం పెత్తనం సబబు కాదని, రాష్ట్రాల నుంచి కేంద్రానికి వచ్చే ఆదాయానికి లెక్కలు చూపాలని డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి నిర్మాణానికి ముప్పై మూడు వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నిస్తున్న నాయకులకు బుచ్చయ్య చౌదరి ప్రశ్నలు గుప్పించారు. గుజరాత్ లో రూ.75 వేల కోట్లతో 80 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టారని, హైదరాబాద్ 3.50 లక్షల ఎకరాల్లో ఉన్న విషయాన్ని ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఈ సందర్భంగా ఆయన విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఉంటున్న ఆయనకు ఏపీ సమస్యలు పట్టడం లేదని అన్నారు.

అవినీతిపరులను ప్రోత్సహిస్తున్న మోదీ

రాజకీయ ప్రయోజనాల కోసం మోడీ అవినీతిపరులను ప్రోత్సహిస్తున్నారని, వైసీపీని అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం డ్రామాలాడుతోందని బుచ్చయ్య చౌదరిఆ రోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీని వైసీపీ నాయకులు ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. బీజేపీ, వైసీపీ తీరును ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. టీడీపీకి రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News