unnavo rape: 'ఉన్నావో' ఘటనపై ప్రభుత్వం, పోలీసులకు అక్షింతలు వేసిన అలహాబాద్ హైకోర్టు
- 'ఉన్నావో' అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన అలహాబాద్ హైకోర్టు
- యూపీలో లా అండ్ ఆర్డర్ కుప్పకూలింది
- ఆరు నెలలుగా కేసు ఎందుకు నమోదు చేయలేదు?
'ఉన్నావో' అత్యాచార ఘటనలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ కేసును పరిశీలించిన జస్టిస్ డి.బి.భోసల, జస్టిస్ సునీత్ కుమార్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ లో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ కుప్పకూలిపోయిందని న్యాయమూర్తులిద్దరూ పేర్కొన్నారు. తనపై అత్యాచారం జరిగిందని యువతి గత ఆరు నెలలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఎందుకు కేసు నమోదు చేసి, నిందితుడ్ని అదుపులోకి తీసుకోలేదని న్యాయస్థానం ప్రశ్నించింది.
అదే సమయంలో ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడినట్లు తగిన ఆధారాలు లేవని వాదించారు. ఈ సందర్భంగా పోలీసులపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రతి దానికీ ఆధారాలు కావాలా? ఆధారాలు లేకపోతే కేసులు నమోదు చేయరా? యువతికి అన్యాయం జరిగినప్పుడు పోలీసుల వద్దకు కాకుండా ఇంకెక్కడికి వెళ్తుంది? అంటూ నిలదీసింది.