Telangana: నాగార్జునసాగర్ పనులపై ప్రపంచ బ్యాంకు సంతృప్తి వ్యక్తం చేసింది: మంత్రి హరీశ్ రావు
- హరీశ్ రావును కలిసిని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం
- రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోందన్న బృందం సభ్యులు
- కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శించాలని కోరిన హరీశ్ రావు
- త్వరలోనే వస్తామని చెప్పిన ప్రతినిధులు
నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులపై ప్రపంచబ్యాంకు ప్రతినిధుల బృందం సంతృప్తిని వ్యక్తం చేసిందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ బృందం నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. అనంతరం, హైదరాబాద్ జలసౌధలో హరీశ్ రావుతో ప్రపంచబ్యాంకు బృందం ఈరోజు సమావేశమైంది. చివరి ఆయకట్టు వరకూ నీరందించే లక్ష్యంతో పదేళ్ల కిందట ప్రపంచబ్యాంక్ నిధులతో చేపట్టిన నాగార్జునసాగర్ ఆధునికీకరణ పనులు తమకు సంతృప్తి కలిగించినట్టు ఈ బృందం తెలిపింది.
ఈ ప్రాజెక్టు పరిధిలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయని, సాగునీటి వసతి వల్ల రైతుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నదని బృందం సభ్యులు తెలిపారు. సాగునీటి పంపిణీ సమర్ధంగా జరుగుతున్నట్టుగా తాము గమనించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఆధునికీకరణ పనులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం చేయాల్సిన పనుల్లో 98 శాతం పూర్తయ్యాయని, మిగతా పనులు జూలై నాటికి పూర్తవుతాయని చెప్పారు.ప్రస్తుతం పూర్తయిన ఆధునికీకరణ పనులతో ప్రాజెక్టు కింద గ్యాప్ ఆయకట్టు 25 శాతం నుంచి 5 శాతానికి తగ్గించినట్టు చెప్పారు. సాగర్ ఆధునికీకరణ పనులకు 2008 లో శ్రీకారం చుట్టారని, కాలువలు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలను ఆధునికీకరించడం ద్వారా సాగునీటి పంపిణీ వ్యవస్థను మెరుగు పరచడం, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, వ్యవస్థాగత సామర్థ్యాన్ని పటిష్టపరచడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
తెలంగాణ పరిధిలో సాగర్ కింద 6,40,814 ఎకరాల మేరకు ఆయకట్టు ఉండగా, ఇందులో నీరందని ఆయకట్టు 1.64 లక్షల ఎకరాల మేరకు ఉందని, ఈ పనులతో సాగర్ నుంచి పాలేరు రిజర్వాయర్‌కు నీరు చేరుకునేందుకు పట్టే సమయం 72 గంటల నుంచి 48 గంటలకు తగ్గిందని అన్నారు. ఇక 31.5 కిలోమీటర్ల మధిర బ్రాంచి కాల్వ పరిధిలో 14.5 కిలోమీటర్ల మేర లైనింగ్ చేయడంతో ఆ కాల్వ కింద 58,895 ఎకరాలకు సాగునీరు అందుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తాను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్ రెడ్డితో కలిసి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో నాగార్జున సాగర్ ఎడమ కాలువ వెంట విస్తృతంగా పర్యటించిన విషయాన్ని ప్రపంచబ్యాంకు బృందానికి హరీశ్ రావు తెలిపారు. రెండు రోజుల పాటు చివరి ఆయకట్టు ప్రాంతం దాకా వెళ్లామని, ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. భారతదేశంలో కొత్త చరిత్రను లిఖించబోతున్న కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులను హరీశ్ రావు కోరారు. కాళేశ్వరం ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరివ్వనున్నట్టు వివరించారు. ఈ ప్రాజెక్టు గురించి తాము ఇప్పటికే తెలుసుకున్నామని త్వరలోనే కాళేశ్వరం సందర్శిస్తామని వారు తెలియజేశారు.