Jana Sena: అలా చేస్తే ఊరిలోని ప్రజలమంతా చచ్చిపోతాం: పవన్ కల్యాణ్‌తో మహిళ ఆవేదన
- పవన్‌ని కలిసిన శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతులు
- భూములకు పట్టాలు ఇవ్వలేదని ఆవేదన
- అమ్ముకొనే అవకాశం లేదని బాధ
- జనసభ నిర్వహించి రైతుల ఘోష వినిపిద్దామన్న పవన్
తిరుపతి అర్బన్ మండలంలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఈ రోజు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ని కలసి తాము ఎదుర్కొంటోన్న కష్టాలు, అనుభవిస్తున్న మానసిక వేదనని చెప్పుకున్నారు. శెట్టిపల్లి గ్రామంలోని భూములని ఎకనామిక్ సిటీ కోసం తీసుకోవడాన్ని తమ గ్రామ రైతులమంతా వ్యతిరేకిస్తున్నామని, తామంతా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నామని తెలిపారు.
400 సంవత్సరాల నుంచి శెట్టిపల్లి ఇనాందారి గ్రామంగా ఉందనీ, ముత్తాతల కాలం నుంచి సాగు చేసుకొంటున్నా ఇప్పటికీ పట్టాలు లేవని చెప్పారు. ఆ గ్రామానికి చెందిన రైతు ఆర్.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. "2012 లో ఉప ఎన్నికల సమయంలో మా ఊరు వచ్చిన చంద్రబాబు నాయుడు గ్రామ దేవత ముత్యాలమ్మ సాక్షిగా శెట్టిపల్లి రైతులకి టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టాలు ఇవ్వలేదు సరికదా భూములు తీసుకొనేందుకు నిర్ణయించారు. పరిహారం కూడా ఇచ్చే ఉద్దేశం లేదు. గతంలో రైల్వేవాళ్లు కోచ్ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు పరిహారంతో పాటు కుటుంబానికో ఉద్యోగం ఇచ్చారు.
ఇలాంటి ఇనాం గ్రామమే అయినా పైడిపల్లికి ఇంతకుముందు చంద్రబాబు ప్రభుత్వంలోనే జీవో ఇచ్చి పట్టాలు అందజేశారు. అలాగే మాకూ న్యాయం చేయమంటున్నాం. పంటలు పండే భూములు లాక్కోవద్దు. ఈ విషయంలో మాకు అండగా నిలబడాలని పవన్ కల్యాణ్ గారిని కోరుతున్నాం" అని అన్నారు.
ఇదే గ్రామానికి చెందిన భాస్కర రావు అనే రైతు మాట్లాడుతూ... '1979 లో సెటిల్మెంట్ సర్వే చేసినా ఇప్పటికీ రైతులకి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు పంటలు కోసే సమయంలో మళ్లీ సర్వే చేస్తూ ఎకనామిక్ సిటీ కోసం ల్యాండ్ పూలింగ్ చేస్తామని రెవెన్యూ వాళ్లు చెబుతున్నారు. 630 ఎకరాలు ఉన్న గ్రామమిది. అందరూ రెండు ఎకరాల లోపు ఉన్న చిన్న రైతులే' అని తెలిపారు.
మరోరైతు మునిమోహన్ వివరాలు వెల్లడిస్తూ.. 'ఈ ఊర్లో భూములు అమ్ముకొనే వీలు లేకుండా చేశారు. అయితే రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్లకి మాత్రం ల్యాండ్ కన్వర్షన్ చేసి, లే ఔట్ అప్రూవల్ కూడా ఇచ్చారు. రైతుకి ఓ న్యాయం, రియల్టర్ కి ఓ న్యాయం చేస్తోంది ఈ ప్రభుత్వం. రెవిన్యూ వాళ్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. ఆఫీస్ లోకి కూడా రానీయడం లేదు. తిరుపతికి దగ్గరగా ఉండటంతో ఈ భూములు లాక్కోవాలని చూస్తున్నారు. మాకు ఫ్యాక్టరీలు, సిటీలు వద్దు... వ్యవసాయమే చేస్తాం' అని స్పష్టంగా చెప్పారు.
రాఘవులు అనే రైతు మాట్లాడుతూ.. 'భూమి ఎప్పుడు లాక్కొంటారో తెలియదు. ఆడ పిల్లలకి పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. అబ్బాయిల చదువులకీ ఇబ్బందే. ఈ భయంతో తిండి కూడా తినలేకపోతున్నాం. ఆవులు అమ్ముకొని పెళ్లిళ్లు చేసుకోమంటున్నారు. ఇదేమి న్యాయం' అని తన బాధను వినిపించారు.
సరోజనమ్మ అనే రైతు మాట్లాడుతూ... 'నాకు ఇద్దరు కూతుళ్లు. తలో పది సెంట్లు కట్నంగా ఇచ్చి పెళ్లి చేశాను. ఆ భూములు అమ్ముకునేందుకు వీలు లేదనడం... మా ఊరు భూములు ప్రభుత్వం తీసేసుకొంటుందని కూతుళ్లని పుట్టింటికి పంపేశారు. ఊర్లో రైతులందరికీ ఇలాంటి కష్టాలే' అని తెలిపారు.
'మా గ్రామ దేవత ముత్యాలమ్మ సాక్షిగా ఊర్లో రైతులకి పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక భూములు లాక్కుంటానంటున్నారు. అలా చేస్తే ఊరిలో ప్రజలమంతా చచ్చిపోతాం' అని వరలక్ష్మి అనే మహిళ అన్నారు.
రైతు క్షేమమే దేశ క్షేమం: పవన్ కల్యాణ్
శెట్టిపల్లి రైతుల ఆవేదన విన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ గ్రామ రైతాంగానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 23వ తేదీ లోపు శెట్టిపల్లికి వస్తానని తెలిపారు. గ్రామం నడిబొడ్డున జనసభ నిర్వహించి రైతుల ఆవేదనని, సమస్యల్ని ప్రపంచానికి చెబుదామని అన్నారు. 2012 లో ముత్యాలమ్మ సాక్షిగా శెట్టిపల్లికి మాట ఇచ్చిన విషయం గుర్తుచేద్దామని తెలిపారు. నాలుగైదు తరాలుగా సాగు చేసుకొంటున్నవారికి పట్టాలు ఇవ్వకుండా భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం సరికాదని చెప్పారు. జనసభ ద్వారా పరిష్కారం కూడా చెబుదామన్నారు. రైతు క్షేమమే దేశ క్షేమం అని జనసేన పార్టీ నమ్ముతుందని స్పష్టం చేశారు.