Pawan Kalyan: ఏపీలో నిరంకుశ పాలన: పవన్ కల్యాణ్ ఆగ్రహం
- చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ
- 5 కిలో మీటర్ల మేర చేస్తోన్న భూ సేకరణ
- ఇళ్లు కూల్చేసి పరిహారం ఇవ్వమంటున్నారన్న బాధితులు
- న్యాయం జరిగే వరకూ బాసటగా ఉంటానన్న పవన్
చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ కోసం 5 కిలో మీటర్ల మేర చేస్తోన్న భూ సేకరణకు ఎలాంటి పరిహారం ఇవ్వమని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో తామందరం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని బాధితులు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి తమ గోడు వినిపించుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు, జీవనోపాధి కోసం వేసుకున్న దుకాణాలు ఉన్నాయని, వాటిని తొలగిస్తే అన్యాయం అయిపోతామన్నారు. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం సేకరించేటప్పుడు పరిహారం ఇవ్వనవసరం లేదనే ఉత్తర్వు చూపించి రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నారని, పోలీస్ బలగాలతో కలెక్టర్ భయపెడుతున్నారని ఆరోపించారు.
ఈ రోజు హైదరాబాద్లోని జనసేన కార్యాలయంలో పవన్ని కలిసిన దయారామన్ అనే వ్యక్తి తమ సమస్యని వివరిస్తూ... 'చిత్తూరు కలెక్టరేట్ నుంచి వెళ్లే ఈ రోడ్డు విస్తరణలో సుమారు 5 వేల మందికి అన్యాయం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి పరిహారం ఇవ్వమంటున్నారు. ఇలాంటి విస్తరణే చేసి శ్రీకాళహస్తిలో డబ్బులు ఇచ్చారు. ఉప ఎన్నికల ముందు నంద్యాలలో పరిహారం ఇచ్చారు... విజయ నగరంలో ఇచ్చారు. చిత్తూరులో మాత్రం ఇవ్వం అంటున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం కోరుతున్నాం' అన్నారు.
అబ్దుల్ రెహమాన్ తమ పరిస్థితిని వివరిస్తూ... 'ఈ రోడ్డు వెంబడి ఉండేది చిన్నాచితకా కుటుంబాలే. ఈ రోడ్డు బదులు మరొక రోడ్డు విస్తరణ చేసినా అభివృద్ధి ఉంటుందని ప్రత్యామ్నాయం చూపించాం. కలెక్టర్ ఆదేశాలతో ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చేందుకు సిబ్బంది వస్తున్నారు' అన్నారు.
మరో బాధితుడు వెంకటేశం మాట్లాడుతూ... 'పట్టణాభివృద్ధికి పరిహారం ఇవ్వక్కర్లేదు అనే ఉత్తర్వును కోర్టు తోసిపుచ్చింది. అయినా ఈ ఉత్తర్వుని చూపిస్తున్నారు. మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు... పరిహారం ఇవ్వమని హైకోర్టుకి చెప్పాం.. కోర్టు మాకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు' అని తెలిపారు.
నిరంకుశ పాలన: పవన్ కల్యాణ్
బాధితులు నష్టపోతుంటే... కొద్ది మంది ప్రైవేట్ వ్యక్తులు లాభపడటం అభివృద్ధి కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. 'అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలి.. కానీ, ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని మానవత్వం లేకపోతే నిరంకుశ పాలన అవుతుంది. అభివృద్ధి జరుగుతున్నపుడు కొంత విధ్వంసం తప్పదు... కానీ, అందుకు తగ్గ పరిహారం ఇవ్వాలి. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందే. ఈ సమస్యపై నేను చిత్తూరు వస్తా.. బాధితులకి హామీ ఇచ్చి, న్యాయం జరిగే వరకూ బాసటగా ఉంటాను' అని అన్నారు.