kathua: ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను కోల్పోయాను.. ఇప్పుడు మూడో పాప కూడా పోయింది!: 'కథువా' ఘటన బాధితురాలి తల్లి
- పాప అదృశ్యమైన మరుసటి రోజు సాంజీ రామ్‌ను అడిగాను
- పాప తిరిగొస్తుందని ఆయన చెప్పారు
- ఇటువంటి దారుణానికి సహకరిస్తారని అనుకోలేదు
- ఓ పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా ఎలా చేయగలిగాడు?
జమ్ము కశ్మీర్‌లోని కథువాలో ఓ చిన్నారిపై కొందరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. తాజాగా, ఆ బాలిక తల్లి ఓ ఇంటర్వ్యూలో తమకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో మాట్లాడింది. తన కూతురు కనపడకుండా పోయిన వారం తరువాత ఒక రోజు తన కలలోకి వచ్చిందని ఆమె చెప్పింది. తనలోని ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్న దానిలా ఇంటి ముందు తన కూతురు కూర్చున్నట్లు ఆ కలలో కనపడిందని తెలిపింది.
ఆ తరువాత మళ్లీ ఎప్పుడూ ఆ కల రాలేదని, తన కూతురు న్యాయం కోసం ఎదురుచూస్తోందని ఆమె వ్యాఖ్యానించింది. తన కూతురికి ఎప్పుడైతే న్యాయం జరుగుతుందో, నిందితులను ఎప్పుడైతే ఉరితీస్తారో అప్పుడే తన కూతురు మళ్లీ తన కలలో కనపడుతుందన్న నమ్మకం తనకుందని చెప్పింది. తాను ఇప్పటికే ఇద్దరు కూతుళ్లను ప్రమాదాల్లో కోల్పోయానని, ఇప్పుడు తన మూడో పాప కూడా దూరమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన కూతురు అదృశ్యమైన మరుసటి రోజు తాను సాంజీ రామ్ (గుడి పూజారి) ని కలిశానని, పాప తిరిగొస్తుంది అని ఆయన చెప్పారని ఆమె తెలిపింది. కానీ, ఆయన ఇటువంటి దారుణానికి సహకరిస్తారని అనుకోలేదని తెలిపింది. ఓ పవిత్రమైన వృత్తిలో ఉండి ఇలా ఎలా చేయగలిగాడని ఆమె ప్రశ్నించింది.