Andhra Pradesh: అది నోరా? అరిగిపోయిన టేప్ రికార్డరా?: చంద్రబాబుపై విష్ణుకుమార్ రాజు ఘాటు విమర్శలు

  • ప్యాకేజీ బాగుందని అసెంబ్లీలో తీర్మానం చేయలేదా?
  • పదే పదే ఒకటే మాట చెప్పడం చంద్రబాబుకు అలవాటై పోయింది
  • 2019లో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు
  • విజయవాడలో మీడియాతో విష్ణుకుమార్ రాజు

ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే బాగుందని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన చంద్రబాబు, యూ-టర్న్ తీసుకున్న కారణాన్ని ప్రజలకు చెప్పాలని బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. చెప్పిందే పదే పదే చెబుతున్న ఆయనది నోరా? లేక అరిగిపోయిన టేప్ రికార్డరా? అంటూ ఘాటు విమర్శలు చేశారు.

ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర సాయంపై ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు చేసిన ప్రకటనలన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో చక్రం తిప్పుతానని చెబుతున్న ఆయనకు, అసలు వేలే లేకుండా పోనుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ దీక్ష చేశారన్న కారణంతోనే ఆయన కూడా దీక్షకు దిగుతున్నారని ఎద్దేవా చేశారు. ఓ ప్రధాని ఎలా దీక్ష చేస్తారని ప్రశ్నించిన ఆయన్ను, ఓ సీఎంగా ఉండి ఎలా దీక్ష చేస్తారని తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. చంద్రబాబు ఓటు బ్యాంకు రాజకీయాలను అప్పుడే ప్రారంభించేశారని, రాజకీయ లబ్ధి కోసమే దొంగ దీక్షలకు దిగుతున్నారని, అందరినీ ఫాలో కావడం, కాపీ కొట్టడం ఆయనకు అలవాటేనని విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News