Chandrababu: చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలి: కంభంపాటి హరిబాబు
- ‘ఏపీకి కేంద్ర సాయం’ పుస్తకాన్ని ఆవిష్కరించిన హరిబాబు
- బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు
- కేంద్రంతో ఘర్షణ వైఖరి ద్వారా ఏపీకే నష్టం కలుగుతుంది
ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ను హర్షిస్తూ అసెంబ్లీలో నాడు ధన్యవాద తీర్మానం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారో ప్రజలకు చెప్పాలని బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు డిమాండ్ చేశారు. ‘ ఏపీకి కేంద్ర సాయం’ పేరిట రాసిన పుస్తకాన్ని ఈరోజు ఆయన ఆవిష్కరించారు. అనంతరం, హరిబాబు మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ప్రయోజనాన్ని ప్యాకేజ్ ద్వారా ఇవ్వాలనుకుంటున్నామని, హోదా ఇస్తే రూ.15 వేల నుంచి రూ.16 వేల కోట్ల నిధులే వస్తాయని అన్నారు.
అసలు బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. 2015-16లో ఎపీకి రూ.9,487 కోట్లు, 2016-17లో 17,242 కోట్లు ఇచ్చామని అన్నారు. సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లి మన ప్రధాని మోదీని విమర్శించడం దురదృష్టకరమని, ప్రాజెక్టులు తరలిపోతున్నాయంటూ టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని, కేంద్రంతో ఘర్షణ వైఖరి ద్వారా ఏపీకే నష్టం కలుగుతుందని అన్నారు.
కేంద్రం సాయం చేద్దామన్నా ఏపీ సహకరించడం లేదు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం సాయం చేద్దామన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, నిధులిస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదని హరిబాబు ప్రశ్నించారు. ప్రభుత్వం రాష్ట్రంలో ఏయే అభివృద్ధి ప్రాజెక్టులు అమలు చేద్దామని అనుకుంటుందో, ఆ అమలుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే దానికి స్వదేశీ సంస్థల నుంచి డబ్బు అందజేస్తామని కోరడం కూడా జరిగిందని అన్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని అన్నారు.