Andhra Pradesh: జగన్ కు తప్పుడు లెక్కలు తప్ప సాగునీటి లెక్కలు తెలియవు : దేవినేని ఉమ
- రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదే
- ఏపీ ప్రయోజనాల కోసం టీడీపీ నిరంతరం పోరాడుతోంది
- వైసీపీ దృష్టిలో రాజీనామాలు అంటే ‘కేంద్రంతో రాజీ పడటం, ఏపీకి నామాలుపెట్టడమే’
వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మండిపడ్డారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు తప్పుడు లెక్కలు చేసి జైలు కెళ్లడం తప్ప, సాగునీటి లెక్కలు తెలియవని విమర్శించారు. రాయలసీమకు నీళ్లిచ్చిన ఘనత తమ అధినేత చంద్రబాబుదేనని ప్రశంసించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తమ ఎంపీలతో రాజీనామాలు చేయించామని చెబుతున్న వైసీపీపై ఆయన విమర్శలు చేశారు. వైసీపీ దృష్టిలో రాజీనామాలు చేయడమంటే.. ‘కేంద్రంతో రాజీ పడటం, ఏపీకి నామాలు పెట్టడమే’ అని కొత్త భాష్యం చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతోందని, ప్రత్యేకహోదా సాధించే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు.
కాగా, ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, పార్లమెంట్ లో ప్రజాస్వామ్య విలువలు మంటగలుస్తున్నాయని, అంబేద్కర్ స్ఫూర్తికి ఇది విరుద్ధమని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సైతం నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, మోదీ ప్రభుత్వం దళితుల హక్కుల్ని కాలరాస్తోందని విమర్శించారు. దళితుల హక్కులపై జగన్ ఏ రోజైనా మాట్లాడారా? జగన్ లాంటి స్వార్థపరులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.