mehreen pirzada: 'అసిఫా'కు న్యాయం చేయాలంటూ మెహ్రీన్ ట్వీట్.. దేశం వదిలి వెళ్లిపొమ్మన్న నెటిజన్
- 8 ఏళ్ల బాలిక హత్యాచారంపై స్పందించిన మెహరీన్
- ఆమెపై మండిపడిన నెటిజన్
- ఘాటు సమాధానమిచ్చిన మెహరీన్
కశ్మీర్లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అసిఫాపై సామూహిక అత్యాచారం, హత్య ఘటన దేశం మొత్తాన్ని కదిలించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినీ నటి మెహరీన్ తన ట్విట్టర్ ఖాతాలో ‘నేను హిందుస్థానీని, సిగ్గుపడుతున్నాను, ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం, హత్య, ఒక ఆలయంలో’ అంటూ ‘అసిఫాకు న్యాయం జరగాలి’ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసిన, ప్లకార్డుతో దిగిన ఫొటోను పోస్ట్ చేసింది.
దీనిపై ఒక నెటిజన్ మండిపడుతూ, ‘హిందుస్థానీగా ఉండటం నీకు అంత సిగ్గుగా అనిపిస్తే దేశాన్ని విడిచి వెళ్లిపో. హిందుస్థానీయులుగా ఉన్నందుకు మేం చాలా గర్విస్తున్నాం. పిల్లలపై ఇలాంటి దారుణాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా జరుగుతున్నాయి. వాళ్లు ఎప్పుడూ ఇలా ఓవర్ యాక్షన్ చేయలేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో ఒళ్లు మండిన మెహరీన్ ప్రతిస్పందిస్తూ, ‘నీలాంటి వారి కోసమే ఈ పోస్ట్ చేశా’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. దీనికి ఆమె అభిమానులు, నెటిజన్లు ‘సరిగ్గా చెప్పావ్, మీకు మద్దతు ఇస్తున్నాం, అంటూ ఆమెను ప్రోత్సహిస్తూ, అలాంటి వారిని పట్టించుకోవద్దని సలహా ఇచ్చారు.