Hyderabad: దళితుడ్ని భుజాలపై మోసుకుని ఆలయప్రవేశం చేయనున్న చిలుకూరు దేవస్థానం ప్రధానార్చకుడు!
- భగవాన్ రామానుజులు సహస్రాబ్ది ఉత్సవాలు
- వివక్షను రూపుమాపే ప్రయత్నం
- మునివాహన ఉత్సవంలో దళితుడికి ఆలయప్రవేశం
వేల ఏండ్లుగా దళితులను అంటరాని వారుగా చూడడం, వారికి ఆలయ ప్రవేశం లేకపోవడం, వారు వేదాలు చదవడాన్ని నేరంగా పరిగణించడం వంటి వివక్ష భావజాలాన్ని రూపుమాపేందుకు నడుంబిగించామని చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధానార్చకులు రంగరాజన్ తెలిపారు. భగవాన్ రామానుజులు సహస్రాబ్ది (1000వ జయంతి) ఉత్సవాల సందర్భంగా జియాగూడ రంగనాథస్వామి ఆలయంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
సహస్రాబ్ది సందర్భంగా నిర్వహించే మునివాహన ఉత్సవంలో అంతరాలు లేని సమాజాన్ని కాంక్షిస్తూ.. తన భుజస్కంధాలపై మోసుకుని ఒక దళితుడ్ని ఆలయంలోకి తీసుకెళ్లనున్నానని ఆయన తెలిపారు. నేటి సాయంత్రం జియాగుడ రంగనాథస్వామి ఆలయంలో ఈ అద్భుత ఘట్టం చోటుచేసుకుంటుందని ఆయన చెప్పారు. రెండు వేల ఏళ్ల క్రితం నాటి లోకసారంగ- తిరుప్పాణాళ్వార్ వృత్తాంతాన్ని గుర్తు చేస్తూ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.