Cricket: 10 సిక్సర్లతో చెలరేగి ఆర్.ఆర్ జట్టుకు విజయం కట్టబెట్టిన సంజు శాంసన్!
- 10 సిక్సులతో చెలరేగిన సంజు శాంసన్
- 45 బంతుల్లో 92 పరుగులు
- సీజన్ లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆర్.ఆర్. జట్టు
ఐపీఎల్- సీజన్11లో భాగంగా చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు వీరవిహారం చేసి, 217 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. రహానే (36), డార్సీ షాట్ (11) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. అనంతరం ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యత సంజు శాంసన్, బెన్ స్టోక్స్ (27) తీసుకున్నారు. జోస్ బట్లర్ (23) స్కోరు బోర్డు పెంచే క్రమంలో పెవిలియన్ చేరాడు. దీంతో చివరి రెండు ఓవర్లలో సంజు శాంసన్, రాహుల్ త్రిపాఠి శివాలెత్తారు. బౌలర్ ఎవరైనా బంతిని బౌండరీ లైన్ దాటించడమే లక్ష్యంగా షాట్లు ఆడారు.
ఈ క్రమంలో సంజు శాంసన్ కేవలం బౌండరీలు (2), సిక్సర్ల (10) ద్వారా 68 పరుగులు చేశాడంటే ఎంత ధాటిగా ఆడాడో ఊహించవచ్చు. మొత్తం 45 బంతులెదుర్కొన్న సంజు శాంసన్ 92 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్ ఆర్ జట్టు 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ ఐపీఎల్ లో ఇదే అతిపెద్ద లక్ష్యం. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన మెక్ కల్లమ్ (4) విఫలం కాగా, డికాక్ (26) ఫర్వాలేదనిపించాడు. కోహ్లీ (57) అర్ధసెంచరీతో సత్తా చాటాడు. డివిలియర్స్ (20) అవుట్ కావడంతో మన్ దీప్ సింగ్ (47), వాషింగ్టన్ సుందర్ (35) మెరుపులు మెరిపించారు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 198 పరుగుల వద్ద ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగించి, ఓటమిపాలైంది.