Chandrababu: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి నామరూపాలుండవు: చంద్రబాబు నిప్పులు
- బీజేపీ గెలిచే పరిస్థితులు లేవు
- పదవి చూసుకుని అహం పెంచుకుంటే పతనమే
- ప్రధానిపై చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు
రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచే పరిస్థితులు లేవని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారు తామనుభవిస్తున్న పదవులకు వినయం పెంచాలే తప్ప, పదవిని చూసుకుని అహం పెంచుకుంటే పతనం తప్పదని పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ప్రస్తావిస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. బీజేపీ గెలవబోదన్న ముద్ర ఇప్పటికే పడిపోయిందని చెప్పిన ఆయన, రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టులో జరిగిన పనులకు సంబంధించిన రూ. 2,723.49 కోట్లను విడుదల చేయాలని కోరుతూ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీలకు లేఖలు రాయాలని జలవనరుల శాఖను ఆదేశించారు. గ్రీవెన్స్ హాల్ లో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆయన, 21వ తేదీ నుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం 15 నుంచి 20 రోజుల పాటు గ్రామాల్లో సైకిల్ యాత్రలు చేయాలని ఆదేశించారు. చివరిలో బహిరంగ సభలు జరపాలని అన్నారు. 20న తాను విజయవాడలో చేసే దీక్షకు సంఘీభావంగా సామూహిక దీక్షలు చేపట్టాలని సూచించారు. దీక్ష నేపథ్యంలో అదే రోజు తలపెట్టిన దళిత తేజం - తెలుగుదేశం సభను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు.