YSRCP: వైసీపీ ఎంపీలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన రాష్ట్రపతి
- ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అంశాల ప్రస్తావన
- ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఎంపీలు
- హామీలు నెరవేర్చాల్సిందేనన్న వైవీ సుబ్బారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలుసుకోనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను వివరించడంతో పాటు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం వంటి అమలుకు నోచని విభజన హామీల గురించి కోవింద్ వద్ద వీరు ప్రస్తావించనున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఎంపీలు ఈ మధ్యాహ్నం కోవింద్ ను కలసి ఓ మెమొరాండం సమర్పించనున్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే తమ డిమాండని, వాటిని నెరవేర్చాలని కేంద్రంలోని బీజేపీకి సూచించాలని తాము కోవింద్ ను కోరేందుకు వచ్చామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ ఎంపీలు మద్దతు పలుకుతారని ఆయన అన్నారు.