Salman Khan: సల్మాన్ ఖాన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్
- అనుమతి మంజూరు చేసిన జోధ్ పూర్ కోర్టు
- కెనడా, అమెరికా, నేపాల్ లో పర్యటన
- వచ్చే నెల 25 నుంచి జూలై 10వరకు షెడ్యూల్
సల్మాన్ ఖాన్ కు ఊరట లభించింది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు మన్నించింది. విదేశీ పర్యటనకు జోధ్ పూర్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు ఈ రోజు అనుమతి మంజూరు చేసింది. కృష్ణ జింకల వేట కేసులో శిక్ష పడి బెయిల్ పై ఉన్న సల్మాన్ ఖాన్, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదన్న షరతు ఉంది. దీంతో ఆయన కోర్టు అనుమతి కోరుతూ ఈ రోజు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ అనంతరం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెనడా, నేపాల్, అమెరికా తదితర దేశాల్లో వచ్చే నెల 25 నుంచి జూలై 10 వరకు సల్మాన్ ఖాన్ పర్యటించేందుకు మార్గం సుగమం అయింది.