nakka ananda babu: విగ్రహాలు కాదు ఆలోచనలు అమలు కావాలి: ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు
- భారతరత్న ఇవ్వదగిన మొదటి వ్యక్తి అంబేద్కర్
- ఆయనకు భారతరత్న ఇవ్వడానికి 1990 వరకు ఆగవలసి వచ్చింది
- నిబద్ధతతో రాజ్యాంగ రచన చేసిన మహావ్యక్తి అంబేద్కర్
రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం ప్రధానం కాదని, ఆయన ఆలోచనలకు ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. అమరావతిలోని సచివాలయం 2వ బ్లాక్ మొదటి అంతస్తు సమావేశ మందిరంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 127వ జయంతిని ప్రపంచ విజ్ఙాన దినోత్సవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ... దేశంలో భారతరత్న ఇవ్వదగిన మొదటి వ్యక్తి అంబేద్కర్ అని, కానీ అటువంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడానికి 1990 వరకు ఆగవలసి వచ్చిందని చెప్పారు. నిబద్ధతతో రాజ్యాంగ రచన చేసిన మహావ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ తన చివరి రోజుల్లో నిమ్నజాతుల కోసం పడిన కష్టాన్ని గుర్తుకు తెచ్చుకొని, తాను ఇక్కడ వరకు లాక్కొచ్చిన రథాన్ని ముందుకు తీసుకువెళ్లండని, వెనక్కు మాత్రం తీసుకువెళ్లవద్దని చెప్పారన్నారు.
అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే వెనక్కు వెళుతున్నట్లుగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారని గుర్తు చేశారు. ఎస్టీ, ఎస్టీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి ఆనందబాబు అన్నారు.
ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ... రిజర్వేషన్ల విషయంలో అంబేద్కర్ తన వాదనా పటిమతో అందరినీ ఒప్పించారన్నారు. ఆ తరువాత కూడా బీసీ రిజర్వేషన్ కు దేశంలో వ్యతిరేకత వ్యక్తమయినప్పుడు న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ఆనాడు ప్రధాని జవహర్ లాల్ నెహ్రూని ఒప్పించి రాజ్యాంగ సవరణ చేయించారని చెప్పారు. దేశంలో రిజర్వేషన్ వ్యతిరేక వర్గం ఒకటి ఎప్పుడూ ఉంటుందని దానిని ఒప్పించగల వాదనా సామర్థ్యం మనం పెంపొందించుకోవాలని ఆయన చెప్పారు. అంబేద్కర్ ఒక్క ఎస్టీ, ఎస్టీ వర్గాల కోసమే కాకుండా బలహీన వర్గాలు, మహిళలు, బాధితుల పక్షాన నిలిచిన గొప్పవ్యక్తని తెలిపారు.