dress code: సిబ్బంది ఫ్యాషన్ దుస్తులు ధరించి వస్తే ఇంటికి పంపిస్తాం: ఐటీ శాఖ
- డ్రెస్ కోడ్ పై ఆదేశాలు జారీ చేసిన ఢిల్లీ ఐటీ శాఖ
- విధుల్లో ఫార్మల్ దుస్తులు ధరించాలి
- ఉన్నత ప్రమాణాలు కలిగిన పనివాతావరణం నెలకొనాలి
ఆదాయపన్ను శాఖ ఉద్యోగులు ఇకపై డ్రెస్ కోడ్ లో కనిపించనున్నారు. ఐటీ శాఖ చీఫ్ ప్రిన్సిపల్ కమీషనర్ ఢిల్లీ కార్యాలయం.. సిబ్బందికి డ్రెస్ కోడ్ పై పలు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్లో.. చాలా మంది ఉద్యోగులు, ప్రధానంగా యువ ఉద్యోగులు విధులకు సాధారణ దుస్తుల్లో హాజరవుతున్నారని తప్పుపట్టింది. దీనిని అంగీకరించేది లేదని స్పష్టం చేసింది.
సిబ్బంది డ్రెస్ కోడ్ ను అనుసరించాలని సూచించింది. అధికారులు, సిబ్బంది కచ్చితంగా ఫార్మల్ దుస్తుల్లో హుందాగా విధులకు హాజరుకావాలని ఆదేశాల్లో సూచించింది. ఫ్యాషన్ దుస్తులు, పార్టీవేర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. తమ కార్యాలయాల్లో హుందాగా వ్యవహరించే సిబ్బందితో ఉన్నత ప్రమాణాలు కలిగిన పనివాతావరణం నెలకొనాలని సంస్థ అభిలషిస్తోందని ఈ ఆదేశాల్లో తెలిపింది. ఈ ఆదేశాలను పాటించని ఉద్యోగులను హుందాగా ఇంటికి పంపించి, నిబంధనలకు అనుగుణమైన దుస్తుల్లో రావాలని సూచిస్తామని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది.