Khammam District: నర్సుపై ఉన్నతాధికారి లైంగిక వేధింపులు.. హెచ్చార్సీని ఆశ్రయించిన బాధిత మహిళ
- నర్సుపై కన్నేసిన ఖమ్మం డీహెచ్ఎంవో అన్నిమళ్ల కొండలరావు
- అసభ్యకరమైన మాటలతో వేధింపులు
- లొంగకపోవడంతో ట్రాన్స్ ఫర్లు
ఉన్నతాధికారి లైంగిక వేధింపులను తాళలేకపోయిన స్టాఫ్ నర్సు మానవ హక్కుల కమీషన్ (హెచ్ఆర్సీ) ను ఆశ్రయించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) లో సదరు మహిళ స్టాఫ్ నర్సుగా పని చేస్తోంది. ఆమెపై ఖమ్మం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీహెచ్ఎంవో) అన్నిమళ్ల కొండలరావు కన్నేశాడు. ఆమె లొంగకపోవడంతో వేధింపుల పర్వం మొదలైంది.
తన కోరిక తీర్చకుంటే ఉద్యోగం నుంచి తీసేస్తానంటూ బెదిరించాడు. అంతేకాదు, బ్రోతల్ కేసు పెట్టి జైలుకి పంపిస్తానని కూడా బ్లాక్ మెయిల్ చేశాడు. అయినా సరే ఆమె ఏమాత్రం తలొగ్గకపోవడంతో ఆమెను 16 నెలల్లో ఆరుసార్లు మారుమూల ప్రాంతాలకు డిప్యూటేషన్ పై బదిలీ చేశాడు. ఎందుకు ఇలా బదిలీ చేస్తున్నారని అడిగితే, సాయంత్రం 5:30 గంటల తరువాత కార్యాలయానికి రావాలని చెప్పేవాడు. అసభ్యంగా ప్రవర్తిస్తూ కోరిక తీర్చమనేవాడు. అతనికి లొంగడం ఇష్టం లేని ఆమె ఆ వేధింపులను మౌనంగా భరిస్తూ వచ్చింది. అయితే వేధింపులు పెరుగుతుండడంతో ఆమె తాజాగా హెచ్ఆర్సీని ఆశ్రయించింది. దీంతో హెచ్చార్సీ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై జూలై 10లోగా సమగ్ర నివేదిక అందజేయాలని మానవ హక్కుల సంఘం ఆదేశించింది.