BJP: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
- కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మండిపాటు
- తాను హిందువునని, మనది హిందూదేశమని వ్యాఖ్య
- తమ పార్టీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుందని ఉద్ఘాటన
- కాంగ్రెస్‌ను గెలిపిస్తే బాబ్రీ మసీదు నిర్మిస్తారని ఆరోపణ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ నేత, ఉత్తర కర్ణాటకలోని బెళగావి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను హిందువునని, మనది హిందూదేశమని, తమ పార్టీని గెలిపిస్తే రామ మందిరం నిర్మిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన లక్ష్మి హెబ్బాలికర్ రామ మందిరం నిర్మిస్తామని హామీ ఇస్తారు కానీ, ఆ పార్టీని గెలిపిస్తే వారు తప్పకుండా బాబ్రీ మసీదును నిర్మిస్తారని వ్యాఖ్యానించారు. మసీదు కోరుకునేవారే కాంగ్రెస్‌కు ఓటేయాలని అన్నారు. గతంలోనూ సదరు ఎమ్మెల్యే పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. ఈ ఎన్నికలు రోడ్లు, నీళ్ల సమస్యలను తీర్చడానికి కాదని, రామ్ మందిరమా? బాబ్రీ మసీదా? అనే విషయాన్ని తేల్చడానికేనని అన్నారు.