Telangana: నగదు కొరత ఉన్న ప్రాంతాలకు డబ్బు పంపిస్తున్నాం : ఎస్బీఐ చైర్మన్ రజనీష్
- రేపటి లోగా డబ్బు అందుబాటులో ఉంటుంది
- విమానాల ద్వారా తరలిస్తున్నారు
- తెలంగాణ, బీహార్ తదితర రాష్ట్రాలకు ఈరోజు సాయంత్రానికి నగదు చేరుకుంటుంది
దేశంలోని పలు రాష్ట్రాల్లో నగదు కొరత కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నగదు కొరత అధికంగా ఉన్న ప్రాంతాలకు డబ్బు రవాణా జరుగుతోంది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆయా ప్రాంతాలకు ప్రస్తుతం నగదు రవాణా అవుతోందని, రేపటి లోగా డబ్బు అందుబాటులో ఉంటుందని అన్నారు.
డబ్బు కొరత తీర్చేందుకు ఇప్పటికే బ్యాంకులు అధిక నగదు నిల్వలు ఉన్న రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. అయితే, నగదు సమస్య ఎక్కువగా ఉన్న తెలంగాణ, బీహార్ మొదలైన రాష్ట్రాలకు ఈరోజు సాయంత్రానికి చేరుకుంటుందని చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ఉన్నపళంగా నగదు వినియోగం పెరగడంతో, నగదు కొరత ఏర్పడిందని, సమస్యను త్వరలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. డబ్బు విత్ డ్రా చేస్తే తిరిగి మళ్లీ ఆ డబ్బు బ్యాంకుల్లో డిపాజిట్ అవుతుంటేనే నగదు రొటేషన్ సజావుగా ఉంటుందని, ప్రజలు బ్యాంకుల్లో డిపాజిట్ చేయకుండా తమ వద్దే ఉంచుకుంటే, బ్యాంకులు ఎంత డబ్బు సరఫరా చేసినా సరిపోదని అన్నారు.