narendra modi: హమారా ఆంధ్రప్రదేశ్ భీ ఆప్ కా గుజరాత్ నహీ: హిందీలో నిప్పులు చెరిగిన బాలకృష్ణ
- ఏపీ అంటే మీ గుజరాత్ కాదు
- మీ పెత్తనం ఇక్కడ సాగదు
- నీచమైన రాజకీయాలు నడుపుతున్నారు
ప్రధాని నరేంద్ర మోదీపై సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ నిప్పులు చెరిగారు. చంద్రబాబు చేపట్టిన 'ధర్మ పోరాట దీక్ష' వేదికపై ఆయన ప్రసంగిస్తూ 'ప్రత్యేక హోదా - ఆంధ్రుల హక్కు' అంటూ నినదించారు. అనంతరం హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ 'హమారా ఆంధ్రప్రదేశ్ భీ ఆప్ కా గుజరాత్ నహీ.. ఆప్ కా హుకుం నహీ చలా సక్తే (మా ఆంధ్రప్రదేశ్ కూడా మీ గుజరాత్ కాదు... మీ పెత్తనం ఇక్కడ కొనసాగదు)' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మా ఆంధ్రరాష్ట్రం ఉత్తరాది కాదు, మీ ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగించడానికి' అంటూ మండిపడ్డారు. తమ నరనరాల్లో ఎన్టీఆర్ రక్తం ప్రవహిస్తోందని అన్నారు. ఏపీలో నీచమైన రాజకీయాలను నడుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రులంటే పిరికివాళ్లు కాదని... రాజకీయాలకే కొత్త అర్థం ఇచ్చారని చెప్పారు. కొందరు దొంగ రాజీనామాలతో దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎంపీలది ప్యాకేజీల రాజకీయమని అన్నారు.