Tamilnadu: నా కుమార్తెలు వేరే లెవెల్.. అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వివాదాస్పద వ్యాఖ్యలు
- మధురై కామరాజ్ యూనివర్సిటీ వివాదంపై విచారణ ప్రారంభించిన రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం
- సీసీ టీవీ ఫుటేజ్ కోసం ఆదేశం
- వివిధ వర్గాలను వేర్వేరుగా విచారణ
విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై దేవాంగర్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను ఉన్నతాధికారుల లైంగిక అవసరాలు తీర్చేందుకు పంపే ప్రయత్నం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఆ సమయంలో సదరు విద్యార్థుల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. మీ స్వప్రయోజనాలకు ఇతర విద్యార్థినుల జీవితాలతో ఆడుకోవడం ఎందుకు, మీ ఇద్దరు కుమార్తెలను పంపవచ్చుకదా? అంటూ ఆ విద్యార్థినులు ప్రశ్నించారు. దానికి ఏమాత్రం తొట్రుపడని నిర్మలాదేవి 'వారు వేరే లెవెల్' అంటూ సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.
కాగా, ఈ వివాదంపై గవర్నర్ నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్మలాదేవి ఫోన్ సంభాషణలను రిటైర్డు ఐఏఎస్ అధికారి ఆర్ సంతానం పరిశీలించారు. నిర్మలాదేవికి సంబంధించిన సీసీటీవీ పుటేజ్ లు ఉంటే అప్పగించాలని సూచించారు. అనంతరం మధురై కామరాజర్ యూనివర్సిటీ వీసీ చెల్లదురై, రిజిస్ట్రారు చిన్నయ్య తదితరులను విచారించారు. ఈనెల 21న మధురై కామరాజ్ యూనివర్సిటీలోని వివిధ విభాగాధిపతులను, నిర్మలాదేవి పనిచేసిన కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందాన్ని ఆయన వేర్వేరుగా విచారించనున్నారు.