surat: సూరత్ రేప్ కేసులో వీడిన చిక్కుముడి.. తల్లీ కూతుళ్లను రూ.35 వేలకు కొని.. హత్యాచారం!
- బాలికది రాజస్థాన్ లోని గంగాపూర్
- ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన లేబర్ కాంట్రాక్టర్
- తల్లీకూతుళ్లపై అత్యాచారం
- కుళ్లిపోయిన స్థితిలో తల్లి మృతదేహం లభ్యం
సూరత్‌లో 11 ఏళ్ల బాలిక రేప్ కేసు వ్యవహారలో చిక్కుముడి వీడింది. కేసులో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అసలు విషయాలు రాబట్టారు. రాజస్థాన్‌లోని గంగాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి ఓ వితంతు మహిళను, ఆమె కుమార్తెను చాకిరీ చేయించుకునే నెపంతో రూ. 35 వేలకు కొనుగోలు చేసినట్టు తేలింది. సూరత్‌లో ఈనెల 6న శరీరంపై గాయాలతో పడి ఉన్న బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెపై కొన్ని రోజులుగా అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. బాలిక శరీరంపై 87 గాయాలుండడాన్ని చూసి అందరూ నివ్వెరపోయారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది.
ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు గంగాపూర్కే చెందిన హర్సయాయి (35)ను అదుపులోకి తీసుకున్నారు. అతడి సోదరుడు హరిసిన్హ్, మరో ఇద్దరు సోదరులు నరేశ్, అమర్ సిన్హ్ గుర్జార్లను శుక్రవారం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిర్బంధించారు.
హర్సయాయి, హరిసిన్హ్లు సూరత్‌లోని మార్బల్ యూనిట్లో లేబర్ కాంట్రాక్టర్లు. నరేశ్, అమర్ సిన్హ్లు వారి దగ్గర పనిచేస్తున్నారు. మార్చి 15న హర్సయాయి గంగాపూర్ కు చెందిన ఓ వ్యక్తికి రూ.35 వేలు చెల్లించి ఓ వితంతు మహిళను, ఆమె కుమార్తెను ఇంట్లో పని నెపంతో తెచ్చుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఆ తర్వాత హర్సయాయి తన మూడంతస్తుల భవనంలో మహిళను, ఆమె 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే తన కుమార్తెపై అత్యాచారం చేయడాన్ని అడ్డుకున్నందుకు తల్లిని చంపాలని హర్సయాయి భావించాడు.
బాలికను హర్సయాయి తన సోదరుడు హరిసిన్హ్ రూంలో పెట్టినప్పటి నుంచి బాలిక తల్లి అదృశ్యమైంది. ఆ తర్వాత హర్సయాయి పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం ఏప్రిల్ 5న బాలిక గొంతు నులిమి చంపేశాడు. అనంతరం కారులో బాలిక మృతదేహాన్ని తీసుకెళ్లి తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదల్లో పడేశాడు. కాగా, ఏప్రిల్ 10న పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న బాలిక తల్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.