google messaging app chat: వాట్సాప్, ఐ మెస్సేజ్ కు పోటీగా గూగుల్ ‘చాట్’ మెస్సేజింగ్ యాప్
- ఎస్ఎంఎస్ మాదిరిగా సందేశాలు పంపుకునే వీలు
- అందుకున్న వారు చూశారా, లేదా తెలుసుకునే వీలు
- ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే పరిమితం
ఫేస్ బుక్ కు చెందిన వాట్సాప్, యాపిల్ కు చెందిన ఐ మెస్సేజింగ్ యాప్స్ కు పోటీగా గూగుల్ ‘చాట్’ పేరుతో ఓ నూతన మెస్సేజింగ్ యాప్ ను తీసుకొచ్చింది. ఇది ఆండ్రాయిడ్ డివైజ్ లను సపోర్ట్ చేసే యాప్. రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్ స్టాండర్డ్ ఆధారంగా పనిచేస్తుంది. వాస్తవానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా పనిచేసే ‘అల్లో’ చాట్ యాప్ ను గూగుల్ గతంలో తీసుకొచ్చింది.
కానీ, అది సక్సెస్ కాకపోవడంతో దానిపై పెట్టుబడులు ఆపేసి చాట్ పేరుతో నూతన యాప్ తీసుకువచ్చింది. ఇందులో సందేశాలు ఎస్ఎంఎస్ మాదిరే ఉంటాయి. కాకపోతే సందేశం అందుకున్న వ్యక్తి దాన్ని చదివిన వెంటనే పంపించిన వారికి ఆ విషయం తెలుస్తుంది. అంతేకాదు, తిరిగి వారు టైప్ చేస్తున్నా ఆ స్టాటస్ తెలియజేస్తుంది. డేటా ఆధారంగా పనిచేసే యాప్ ఇది. చాట్ ను తీసుకొచ్చినప్పటికీ అల్లో యాప్ ను నిలిపివేసే ఆలోచన లేదని గూగుల్ కమ్యూనికేషన్స్ టీమ్ హెడ్ అనిల్ సభర్వాల్ తెలిపారు.