Andhra Pradesh: ఏపీలో పలుచోట్ల బాలకృష్ణ దిష్టిబొమ్మలు దగ్థం.. నెల్లూరులో ఉద్రిక్తత!
- ప్రధానిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నిరసన
- నెల్లూరులో బీజేపీ-టీడీపీ మధ్య ఘర్షణ
- విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడలో దిష్టిబొమ్మలు దగ్థం
ప్రధాని నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ హీరో బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ను కలిసి బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, నెల్లూరులోని గాంధీ బొమ్మ సెంటర్ లో బాలకృష్ణ దిష్టిబొమ్మను బీజేపీ నేతలు దగ్ధం చేశారు. అయితే, బీజేపీ తీరును నిరసిస్తూ టీడీపీ నేతలు కూడా అదే సెంటర్ లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో, పోలీసులు కల్పించుకుని వారికి సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కాగా, మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతిలో బీజేపీ నేతలు మండిపడ్డారు. అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కాకినాడలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. కలెక్టరేట్ ఎదుట ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసి నినాదాలు చేశారు. బీజేపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. విజయవాడలోని బీజేపీ కార్యాలయం వద్ద, గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద బాలకృష్ణ దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. బాలకృష్ణను అరెస్టు చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.