giriraj singh: హిందువుల్ని అప్రదిష్ఠ పాలు చేసే కుట్ర జరుగుతోంది: కథువా కేసుపై సంచలన ఆరోపణలు చేసిన కేంద్ర మంత్రి
- రాజకీయ గేమ్ ప్లాన్ లో భాగంగానే కేసుపై రాద్ధాంతం
- సెక్యులరిజం పేరిట హిందువులకు చెడ్డపేరు తెస్తున్నారు
- కథువా సామూహిక హత్యాచారాన్ని ఖండిస్తున్నాను
కథువా హత్యాచార కేసు ద్వారా హిందువులను అప్రదిష్ఠపాలు చేసే కుట్ర జరుగుతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కథువా హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతున్న క్రమంలో బీహార్ లోని సొంత నియోజకవర్గమైన నవాడాలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ గేమ్ ప్లాన్ లో భాగంగానే ఈ కేసుపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు దేశాన్ని విడగొట్టేందుకు కుట్ర పన్నారని అన్నారు. సెక్యులరిజం పేరిట కొందరు హిందువులకు చెడ్డపేరు తెస్తున్నారని ఆయన అన్నారు. గతంలో స్వామి అసీమానందపై ‘హిందూ టెర్రర్’ ముద్ర వేసే ప్రయత్నం జరిగిందని, కథువా కేసు పేరిట హిందువులను కించపర్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన చెప్పారు. కథువా సామూహిక హత్యాచారాన్ని ఖండిస్తున్నానని, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు.