Chandrababu: చంద్రబాబు గారూ! మీరు చేసిన దీక్ష జపాన్ తరహా ఉద్యమంలా లేదే! : అంబటి రాంబాబు
- జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలన్నారుగా
- నిన్న మీరు చేసిన నిరాహార దీక్షా ఉద్యమం అలాంటిదేనా?
- రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ కూర్చోబెట్టుకున్నారు
- మీది ధర్మ పోరాట దీక్ష కాదు 420 దీక్ష
జపాన్ తరహాలో పని చేస్తూ ఉద్యమాలు చెయ్యాలని చెప్పిన చంద్రబాబు, నిన్న తన ధర్మపోరాట దీక్షను ఆ విధంగా చేయలేదని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని తన ముందు కూర్చోబెట్టుకుని చంద్రబాబు ఈ దీక్ష చేశారని అన్నారు.
‘అయ్యా, చంద్రబాబునాయుడుగారు! నిన్న మీరు చేసిన నిరాహారదీక్షా ఉద్యమం పని చేస్తూ చేసిన ఉద్యమమేనా? రాష్ట్రంలో ఉన్న అధికారులందరినీ పనీపాటా లేకుండా చేసి మీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ, సీపీఐ, సీపీఎంలు, జనసేన పార్టీ మీకు మద్దతు ఇవ్వలేదు. మీరేమో ధర్మ పోరాట దీక్ష అంటున్నారు కానీ, ప్రజలను మోసం చేసే దీక్ష ఇది. ఇది 420 దీక్ష. ఈ దీక్షలో పాల్గొనమని చెప్పిన పార్టీల వాళ్లందరూ ద్రోహులట! ;ప్రభుత్వ సొమ్ముతో చేసిన నిరాహార దీక్ష ఇది. కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత తనపై దాడి చేస్తున్నారనే స్వరాన్ని వినిపించడానికి చంద్రబాబు నిన్న తీవ్రంగా ప్రయత్నం చేశారు. మోదీతోను, వారి తాబేదార్లతోనూ చంద్రబాబు ఇంకా రహస్య మంతనాలు చేస్తున్నారు’ అని విమర్శించారు.