Pawan Kalyan: అది కాదు.. దాని వెనక ఇంకేదో ఉంది: అనుమానం వ్యక్తం చేసిన వర్మ
- సారీ చెప్పిన తర్వాత కూడా పవన్ అంతగా స్పందించడం ఏంటి?
- పవన్ ఫ్యాన్స్‌కు కనీస ఇంగితం లేదు
- పవన్ మైండ్ సెట్ ఏంటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు
సినీ నటి శ్రీరెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరిగి పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి ఆగింది. తన తల్లిని కించపరుస్తూ శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను పదేపదే ప్రసారం చేశారని, దీని వెనక కొన్ని చానళ్లు ఉన్నాయని ఆరోపించిన జనసేన అధినేత పవన్.. ఆయా చానళ్లపై కేసులు వేసేందుకు సిద్ధమవుతుండగా, టీవీ9 ఇప్పటికే ఆ పనిచేసింది. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు వర్మ మరోమారు స్పందించాడు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో ఫోన్లో మాట్లాడుతూ.. ఈ వివాదానికి కారణమైన తాను ఇప్పటికే పవన్‌కు సారీ చెప్పానని తెలిపాడు. చంద్రబాబు చేపట్టిన దీక్ష నుంచి జనాల దృష్టిని మళ్లించేందుకే పవన్ ఇలా చేశారని ఆరోపించిన వర్మ.. అసలు ఏం జరిగిందో తాను చెప్పిన తర్వాత కూడా పవన్ అంతగా ప్రతిస్పందించడం చూస్తుంటే దీని వెనక ఇంకేదో ఉన్నట్టు అనుమానం కలుగుతోందన్నాడు. పవన్ అభిమానులకు కామన్సెన్స్ లేదని, సోషల్ మీడియాలో వారు వాడే భాష చూస్తుంటే వారెలాంటి వారో అర్థం చేసుకోవచ్చని అన్నాడు.
మీడియాను బాయ్‌కాట్ చేయాలన్న పవన్ పిలుపుపైనా వర్మ స్పందించాడు. తాను మహారాజునని, తన వద్ద సైన్యం ఉందని పవన్ ఊహించుకుంటున్నారని వర్మ ఎద్దేవా చేశాడు. నాకున్న సైన్యాన్ని ఉపయోగించుకుని అడ్డువచ్చిన వారిపై దాడి చేస్తానని ఆయన అనుకుంటున్నారని పేర్కొన్నాడు. దీనిని బట్టి పవన్ మైండ్ సెట్ ఏంటో స్పష్టంగా అర్థం అవుతోందన్నాడు. అభిమానులకు జన సైనికులు అని పేర్లు పెట్టడాన్ని బట్టి అతడేంటో అర్థం చేసుకోవచ్చని వర్మ విమర్శించాడు.