amit shah: 2019లో మెగా కూటమిని ఏర్పాటు చేస్తాం.. కొత్త పార్టీలు చేరబోతున్నాయ్: అమిత్ షా
- మోదీ హయాంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదు
- మాల్యా, నీరవ్ మోదీల స్కాంలు యూపీఏ హయాంలో జరిగినవే
- కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధిస్తాం
వచ్చే ఏడాది జరగనున్న సాధారణ ఎన్నికల్లో మెగా కూటమిని ఏర్పాటు చేయబోతున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్న పార్టీలన్నీ కూటమిలో కొనసాగుతాయని... కొత్త పార్టీలు కూడా వచ్చి చేరబోతున్నాయని ఆయన తెలిపారు. అయితే, కొత్తగా వచ్చి చేరే పార్టీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ పార్టీలన్నీ మోదీ నేతృత్వంలో ఎన్నికల బరిలోకి దిగుతాయని చెప్పారు. ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వివరాలను తెలిపారు.
గత నాలుగేళ్ల మోదీ పాలనలో కుంభకోణాలు చోటు చేసుకోలేదని... బీజేపీ మంత్రులు కానీ, ఎంపీలు కానీ అవినీతి కేసుల్లో ఇరుక్కోలేదని అమిత్ షా చెప్పారు. 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని... దీనికి తమ విధానాలు, పనితీరే కారణమని తెలిపారు. అట్టడుగు స్థాయికి పాలనను తీసుకెళ్లడమే తమ విజయమని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటకలోని అన్ని ప్రాంతాల్లో తాను పర్యటించానని... కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు రాష్ట్రమంతా వీస్తున్నాయని చెప్పారు. హిందూ ఉగ్రవాదం అనే పదాన్ని వాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేస్తోందని... ఉగ్రవాదానికి మతం ఉంటుందా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి తాము ఎన్నడూ మతం రంగు పూయలేదని చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు యూపీఏ హయాంలోనే రుణాలు ఇచ్చారని... ఆ అంశంతో బీజేపీ నేతలెవరికీ సంబంధం లేదని అన్నారు.