Bonda Uma: ముష్టి శ్రీనివాస్ పై క్రమశిక్షణా చర్యలు తప్పవు: బొండా ఉమ
- పార్టీ కోసం ఏనాడూ పని చేయలేదు
- ఇలాంటి ద్రోహులను పార్టీ క్షమించదు
- క్రమశిక్షణ చర్యలు తప్పవు
ముష్టి శ్రీనివాస్ అనే వ్యక్తి ఏనాడూ పార్టీ కోసం పని చేయలేదని విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా తన నియామకంపై మీడియా సమావేశం నిర్వహించి, ఆరోపణలు గుప్పించడంపై ఆయన సీరియస్ అయ్యారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముష్టి శ్రీనివాస్ పై పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.
పదేళ్ల పాటు ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం శ్రీనివాస్ చేసిందేమీ లేదని... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీ తరపున ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదని విమర్శించారు. ఇలాంటి ద్రోహులను పార్టీ క్షమించదని అన్నారు. బ్రాహ్మణ మహిళలకు సబ్సిడీ రుణాలు, కుట్టు మెషీన్లు ఇప్పించానని చెప్పారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన గండూరి మహేష్ ను నిలబెట్టి, గెలిపించానని తెలిపారు. టీటీడీ అన్ని వర్గాలకు చెందినదని, ఏ ఒక్క వర్గానికి సంబంధించినదో కాదని చెప్పారు. ముష్టి శ్రీనివాస్ విజయవాడ బ్రాహ్మణ సేవా సంఘం కోశాధికారిగా కూడా వ్యవహరిస్తున్నారు. బొండా ఉమా గురించి శ్రీనివాస్ మాట్లాడుతూ, అసెంబ్లీలోనే సభ్యతగా మాట్లాడటం చేతకాని బొండా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా అనర్హుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై బొండా ఉమ విమర్శలు గుప్పించారు.