nirbhaya: బాలికలపైనే కాదు, ఏ మహిళపై అత్యాచారం చేసినా ఉరిశిక్ష విధించాలి: ‘నిర్భయ’ తల్లి ఆశాదేవి
- దేవతలా పూజించాల్సిన మహిళపై అత్యాచారాలా?
- అత్యాచారాలకు గురైన వారి తల్లిదండ్రులకు మిగిలేది కడుపుకోతే
- మహిళలపై ఈ దారుణానికి ఒడిగట్టిన వారినీ ఉరితీయాలి
పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం చేసే నిందితులకు మరణశిక్ష విధించే ఆర్డినెన్స్ పై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘నిర్భయ’ ఘటనలో బాధితురాలి తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడుతూ, బాలికల పైనే కాదు మహిళలపై ఎవరిపై అత్యాచారాలకు పాల్పడినా కూడా ఉరిశిక్ష విధించాలని కోరారు.
దేవతలా పూజించాల్సిన మహిళపై అత్యాచారాలు జరగడం దారుణమని అన్నారు. బాలికలైనా, యువతులైనా అత్యాచారాలకు గురైతే వారి తల్లిదండ్రులకు మిగిలేది కడుపుకోతేనని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే, చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరితీయాల్సిందేనని ఆశాదేవి డిమాండ్ చేశారు.