Narendra Modi: ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బాలకృష్ణ పర్యటన
- రామకృష్ణ థియేటర్లో 'జై సింహా' శతదినోత్సవం
- ప్రత్యేక హోదాపై ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేశానన్న బాలకృష్ణ
- మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని వ్యాఖ్య
తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని, ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజల ఆగ్రహాన్ని, ఆవేదనను మాత్రమే వ్యక్తం చేశానని సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో నిర్వహించిన 12 గంటల నిరాహార దీక్షలో పాల్గొన్న బాలకృష్ణ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ రోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ విధంగా వివరణ ఇచ్చారు.
కాగా, తెలుగు సినీ పరిశ్రమలో చెలరేగుతోన్న వివాదంపై పెద్దలు కూర్చొని మాట్లాడడం శుభపరిణామమని బాలయ్య వ్యాఖ్యానించారు. తన పర్యటనలో భాగంగా బాలయ్య.. చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 'జై సింహా' శతదినోత్సవం నిర్వహిస్తోన్న సందర్భంగా ఆ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సీ కల్యాణ్ నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దోషి నటించారు. ఈ ఏడాది జనవరి 12న విడుదలైన ఈ సినిమా నిన్నటికి వంద రోజులు పూర్తి చేసుకుంది.