Pawan Kalyan: టీవీ9 శ్రీనిరాజు లాయర్ కు నా సమాధానం ఇదే!: పవన్ కల్యాణ్
- మీ క్లయింట్ స్పందించినందుకు ఆశ్చర్యం కలిగింది
- నేను మీ క్లయింట్ పై నిందలు మోపలేదు
- ట్విట్టర్ ద్వారా నా ఫీలింగ్స్ మాత్రమే చెప్పా
తన తల్లిని కించపరిచేలా పలు టీవీ ఛానళ్లలో పదేపదే ప్రసారం చేశారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కొన్ని ఛానళ్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. కొన్ని ఛానళ్ల యాజమాన్యాలపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ కు టీవీ9 శ్రీనిరాజు లాయర్ నోటీసులు పంపారు. దీనిపై పవన్ తాజాగా ట్విట్టర్ ద్వారా స్పందించారు. శ్రీనిరాజును లాయర్ సునీల్ రెడ్డిని ఉద్దేశిస్తూ ట్విట్టర్ లో ఓ లేఖ పోస్ట్ చేశారు.
'ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి చేసే ట్వీట్లు ఆ వ్యక్తి ఫీలింగ్స్, అభిప్రాయాలను వెల్లడిస్తాయి. మీ క్లయింట్ ను ఉద్దేశించి నేను చేయనటువంటి ఓ ట్వీట్ కు ఆయన మీ ద్వారా ఎందుకు స్పందించారో నాకు ఆశ్చర్యం కలిగింది. మీ క్లయింట్ గురించి ఎలాంటి నింద మోపలేదు. ఆయనే అలా ఊహించుకుంటున్నట్టున్నారు. లేదా తప్పు చేశానన్న భావనలో అయినా ఉండవచ్చు.
2018 ఏప్రిల్ 20న చేసిన ట్వీట్ లో... మీరు చెప్పినట్టు పరోక్ష నిందలు, లేదా ఆరోపణలు, లేదా నిరాధార వ్యాఖ్యలు లేవు. నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా ఫీలింగ్స్ ను చెప్పాను. మీరు నోటీసులో చెప్పినట్టు... చట్ట ప్రకారం ఇది ఎవరిపైనా దాడి చేసినట్టు కాదు.
నాకు ఎన్ని ఆటంకాలు కలిగించినా... నా లక్ష్యం నుంచి నేను పక్కదోవ పట్టను. సమాజంలోని అన్ని వర్గాలు ఎదగడానికి కృషి చేస్తా. నేను పైన చెప్పిన వివరాలను దృష్టిలో ఉంచుకుని... మీ క్లయింట్ కు సరైన సలహాలు ఇస్తారని భావిస్తున్నా' అంటూ పవన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లేఖలో పేర్కొన్నారు.